అరక్షణీయం--------
----------------రావెల
***************************
రక్షణ కవచం రాలి పడుతూ
నేలమీదకొరిగింది.
ప్రభాతసమయంలోనో పట్టపగటిపూటనో
ఇతమిద్ధంగా తేలలేదు.
అర్ధరాత్రో అపరాత్రో అలాజరిగి
వుండేందుకూ ఆస్కారం లేకపోలేదు.
ఘనీభవింపజేసే మంచుముక్కలమీదన
నడుస్తూన్న దేహమది.
సరిగ్గా ఊపిరి తీసుకునే వ్యవధానమివ్వని
వాతావరణానుకూలతలేని ప్రాంతమది.
రాత్రనకా పగలనకా పంటపొలాలను
అనుక్షణం తనకనుసన్నలలో నిలుపుకుని
తగు జాగ్రత్తలు తీసుకుంటూ నడయాడే
దిష్టిబొమ్మలాంటి
మంచి మనిషికప్పుకున్న కవచమది.
మనమంతా హాయి హాయిగా గుండెమీదన చెయ్యివేసుకుని నిద్రపోవాలని
తను నిద్రకన్నెరుగకుండా తిరుగాడె తనువుకు
కప్పుకున్నసమ్రక్షణకవచమే అది.
నాలుగుగోడలమధ్యన మన సుఖ సంతోషాలను
చెరపకుండా హాయైన జీవితం కోట్లాదిమందిమి
తన సాటి సోదరగణంలా భావించి అహోరాత్రాలూ శ్రమించే
శరీరానికి కప్పుకున్న కవచ కుండలాల్లాంటి
రక్షణ కవచమది. సాహసోపేతమైన సాయుధుడైన
సైనికుడు క్రమశిక్షణకు భాష్యం చెప్పగల తొడుగుకదా అది.
అతని వయస్సు మాత్రం అత్త్యంత ఎక్కువైనదేమీకాదుగూడా!!
అయినా తన కర్తవ్య నిర్వహణసమయంలో శతృమూకలను
తుదమొట్టించే ప్రక్రియలో భాగంగా తన కుటుంబాన్ని
కొత్తగా తమ గృహప్రాంగణాలను పావనం చేయాలన్న తలంపుతో
మురిసి ముక్కలవుతూ వచ్చిన ముద్దు ముద్దుపాపాయిలను
ప్రతిక్షణం గుర్తుంచుకోవాలనీ వారిపైచూపే శ్రద్ధనే
అశేషమైన తనను నమ్ముకున్న జన వాహినిపైనే ప్రసరింపజేయాలని
తపనపడుతూ ధరించిన బరువైన రక్షణకవచమది.
అదిప్పుడు శతృమూకలదాడిలో జారిపడి నేలకొరిగిపోయింది.
రెండు కన్నీటి బొట్లనయినా ఇప్పుడిప్పుడే రాల్చి మన కృతజ్ఞతా భావాన్ని వినయ విధేయలతో ప్రకటించుకుందాం.
అతను మిగిల్చిన జ్ఞాపకాలతోకాలం వెళ్ళదీయాల్సిన అతని కుటుంబానికి రక్షణగా
మనం ఈ ధరిత్రిపై రక్షణ కవచాల్లా నిలుద్దాం. విపత్కర సమయంలో వారికి మరోమంచికుటుంబమనే భావనతో అతని ఆత్మ శాంతించేలా మన ప్రవర్తను మార్చుకుందాం.
No comments:
Post a Comment