Wednesday, January 13, 2016

మనసున్న మనిషి ఎదురుగా నిలబడి
యేవయినా కొన్ని మంచి మాటలు చెప్పమన్నప్పుడు
సరయిన మాటలను వెదుక్కోవడం అందరికీ
సామాన్యంగా కలిసివచ్చే సందర్భమేననుకుంటాను.

కలివిడిగా మాటలు కలుపుకోవాలనుకోవడం
అవతలివారి దృక్పధమైనప్పుడు  మాటలను
మనసుకు హత్తుకునేలా మంత్రించి చెప్పగలగడం
ఒక వరమని ఎవరయినా నొక్కి వక్కాణిస్తే కాదనలేం.

మాటలు సహజంగా సుతిమెత్తగా సుమలాస్యంతో
పోటీ పడినప్పుడే సంభాషణ సారళ్యాన్ని సంతరించుకుంటుంది.
ఎదుటి వారి హృదయాల్లో సౌమనస్యాన్ని చొప్పిస్తూ
కరుణను చిప్పిల్లజేయడానికి దోహదపడుతుంది.

మాటలను మూటలుగా కట్టి ముందుపడేసే దృక్పధంకొందరిది.
తనకు తెలిసినదంతా ఒక్కుదుటున కక్కేయాలన్న దుగ్ధ మరికొందరిది.


మాటలన్నీ ప్రతిసందర్భంలోనూ ఝoఝామారుతాల్లా వీవడమూ
శ్రేయస్కరమనిపించుకోదు,ససేమిరా శత్రుగణాన్ని
 పెంచుతుందని మనమంతా గుర్తెరిగి మసలుకోవాలి.
అందుకే మాటలు మలయమారుతంలావీచి
అవతలివారి కి శ్రవణపేయమై శోభించే విధంగా వెలువరించహలగాలి.

మాటలు తూటాల్లా పేలుతూ,  అవతలివారి హృదయగత మార్దవాన్ని
తునాతునకలుగా  చేసే విధంగా వెలువడ  కుండా జాగ్రత్తపడడం కూడా అభిలషణీయమే.
శోభాయమానంగా  లేకున్నా పర్వాలేదుగాని క్షోభకు అక్షరాలా  కారణం కాకూడదు.

మాటలకూ ఓ శక్తి వుంటుందనీ వాటికీ ఓ అవధివుందనీ దానికి శరసంధానపు
 బిగువుంటుందనీ గ్రహించి  మనం గుర్తుచేసుకుంటూ
 సంభాషణను సాగించేనేర్పు అత్యంతావశ్యకం.

మాటలు మంత్రించిన రీతిగా అవతలి హృదయాలను దోచుకునేలా వుండాలి.
ముల్లులా గుచ్చుకుoటూ వారిని జీవితాo తం కల కుపెట్టేలా రూపొందకూడదు.

No comments:

Post a Comment