Monday, November 30, 2015

దారంతా మంచుదుప్పటి
నీ కోసం
ప్రయాస పడుతూ
నాలో చెలరేగుతున్న  చలి.
--------------------
చిరుచలి మొదలయింది
నులివెచ్చదనాన్నందించే
నువ్వులేవని ఋజువయింది.
------------------------
అప్పుడప్పుడూ పడుతూన్న తుప్పర
నీకోసం వెదుకుతూ
విసిగివేసారిన  అశ్రు ముఖం
--------------------------
తొందర తొందరగా
విస్తరించే చీకటి
వెలుగు దీపానికి
 నువ్వు రానేరావని
అప్పుడే  తెలిసిపోయిందా?
---------------------------------

Sunday, November 29, 2015

అధ: స్సూచికలు
-------------
ప్రభాత సమయంలో
పురివిచ్చుకుని పరిమళించే
పారిజాతసుమాల్లా,
మధ్యాహ్నానికల్లా
ముకుళితదశనుంచి
వికసిత నయనాలతో
విప్పార్చుకున్నమందారాల్లా
చీకటి దుప్పటికప్పుకొగానే
సురభిళ పరిమళాలతో మత్తెక్కించే
మల్లెపూల సౌరభంలా
మనసును చుట్ట్టేసుకుని
వదలను పొమ్మంటే,
మధురాతి మధురమైన
జ్ఞాపకాలన్నీ
గుండెగొంతుకలోకి చేరి
గుస గుస లాడడం మొదలెట్టి
దినంతెల్లవార్లూ నన్ను
 దిగులుచెంతకు నెట్టే సి
దిగాలుపడి కూర్చుంటున్నాయ్!

దీనికి సబబైన పరిష్కార మార్గమేదో
నువ్వే సూచించాలి ప్రభూ!!మరువకు!!!

ఈ అధస్సూచికలనన్నింటినీ
అందమైన సుమహారంగా
అలంకరించడం మాత్రం
 నీది కానే కాదంటూ
 బుకాయించకు , ప్రభూ!
==========================

Saturday, November 28, 2015

వరవీణా మృదుపాణీ
గురుతరమౌ బాధ్యతలను గొణకొనవమ్మా!
సురుచిరసంపదలెన్నియు
పురిగట్టుచు ఇచ్చినంత  పుణ్యము రాదా?

కోడలా నాపతియె నీకు కొడుకుగాదె
మూడుకాళ్ళతొ నడిచెడు ముసలివగ్గు
అన్నపానాలనిడుటలొ అతిశయముగ
ప్రేమజూపిన చాలును పొంగిపోదు.

వెలుగువు నువ్వవుతావని
వేదనచెందడం మరిచాను
వేదనకు ప్రతిరూపమేనీవై
వెలుగుకే దూరంచేసి మురిసావు.
సహనానికీ అసహనానికీ మధ్యన
సం యుక్తాక్షరమై వెలుగుతావనుకుంటే
సందేహాస్పదమైన వ్యాఖ్యలుజేసి
సమూలంగా సహనాన్ని ద్విక్తాక్షరంగా
శాసించి,  సకృత్తువై మిగిలావు

Friday, November 27, 2015

జవాబులకోసం వెదుకుతున్న ప్రశ్నలు
-------------------------------రావెల.
=========================================

నీళ్ళుజలజలా పారాల్సినచోట
నిప్పులెందుకు కణ కణా మండుతున్నాయ్?
మౌనంగా రోదించగలిగిన మనసు
కేకలతో పెడబొబ్బల్తో కెవ్వుమంటున్నదెందుకని?
సహనానికి మారుపేరుగా చరిత్రకెక్కిన జాతి
అసహనాన్నంతగా ప్రదర్శిస్తున్నదెందుకని?
మరో మహాప్రస్థానంకోసం అడుగుముందుకేయాల్సిన ప్రపంచం
తిరోగమన దిశగా చిత్తగించేందుకు తొందరపడుతున్నదెందుకని?

మూడుయాభైలుపైగా సాగుతుందనుకున్న సాహితీ ప్రస్థానం
మూడుకాళ్ళముదుసలిగా మూలకు జరిగి మౌనరాగాన్నలపించడమెందుకని?

కవితలు రాయగ నేర్చితి
భవితయె బంగారుకాంతిప్రసరింపంగా
కవితలనల్లుటమానితి
భవితయె సోమరులచేత బాధ్యతమరువన్.
ఎవడోయేదో అనగా
కవులందరు యేకమౌచు కవితలు వ్రాయన్
భవదీయుడు వినయముగా
కవితలలో తిట్టలేక  గాఢత బడసెన్.

Thursday, November 26, 2015

ప్రశ్నార్ధకంగా చూసే నీకళ్ళు
నన్ను అపేక్షరహితంగా చూస్తుంటాయెందుకని?
పున్నమినాటి చంద్రుని చూడగానే
 పులకలెత్తి ఎగసిపడే అలలుకూడా
అలా తీక్షణంగా చూసిన దాఖాలేమీ లేవు.
ఎందుకుమరి ఇందుకు పూర్తిగా భిన్నంగా నీ దృక్కులు
నన్ను అలక్ష్య భావంతో అలా సారిస్తూ కొనసాగడం?

ఆద్యంతంగా నా మనసులోని భావాలనన్నింటినీ
వొలిచి మరీ నీ ముందు నగ్నంగా నిలబెట్టాను.
అయినా నేను ఎప్పటికీ అపరచితగానే మిగల్చడం భావ్యమా?
అదేనేను ఒక వజ్రాన్నయివుంటే నీవెంతగా దాన్ని పగల గొట్టినా
ఒక్కోముక్కలోనూ నీ రూపమే నన్ను అలరిస్తూ వుంటావు!!
వాటినన్నింటినీ ఓ దండగా గుచ్చి నీ మెడలో హారంగా మలచి
చిరంతనానందంతో చివురులు తొడుగుతూ వుండే వాడిని.

నేనొక సుమాన్నయివుంటే దాన్ని తరువునుంచి త్రుంచి
నీ జడలో తురిమి సంతసిస్తూ కాలం గడిపే వాడిని.
ఇది వజ్రమూ కాదు, సురభిళ పరిమళసుమమూకను
ఇది సున్నితమైన ఓ హృదయమని గుర్తెరుగు అది చాలు.
దాని అనుపానాలన్నీ నీవెరుగనివా ప్రభూ?

ఈ ప్రణయ సామ్రాజ్యంలో ప్రధితుడవైన మహారాజువు నీవు.
ఈ ఆత్మనుగతమైన ప్రేమను కన్నీటి ప్రవాహాల్లో
కరగించాలని భావించమోకు ప్రభూ!!
సంతాపమైనా, సంతోషమైనా
అవధులు దాటి పోతున్నాయని గ్రహించు.

నీ కత్యంత సన్నీతంగా మెలగడమే జీవితానికి
సాఫల పురస్కారమని గుర్తించు.

[టాగూరు తోటమాలిలోని ఒక కవితకు నా అనువాదం]
=======================================

Wednesday, November 25, 2015

శిశిరంలో ప్రభాతవేళ
ఆవిడేమో నామీసంలోని
పలితకేశాలను క్షుణ్ణంగా
 పరికిస్తూ!!
----------------
శిశిరంలో అసురసంధ్యవేళ
తల్లిదండ్రులిద్దరూ
 మౌనంగా
ఉయ్యాలలూగుతూ!
------------------
కొండవాలుదిగువ నడకలో
సూర్యాస్తమయపు జ్ఞాపకాలు
ప్రతిశ్వాసలోనూ ప్రతిబింబిస్తూ!
---------------------
నాన్నేమో
 నదీగర్భంలో స్నానంచేస్తూ
అపనమ్మకాలను మునకలేయిస్తూ.
---------
రైలు కిటికీ దగ్గర
నా వేలికొసలపైన
భ్రమర విన్యాసం
----------

ఆంగ్లం---- రమేష్ ఆనంద్

==========================

మృత్యువువనే
మౌన విహంగం
మ్రోగిస్తూనే వుంటుంది
మరణ మృదంగాన్ని.

ఆ నాదం
నినాదంకాదని
తెలుసుకోగలిగితే
నీవు మృత్యుంజయుడవే సుమా!!

Monday, November 23, 2015

మూల్యాంకనం
----------------------
పక్షుల కిలకిలారావాలతో
ప్రభాతసుందరి శుభోదయం పలుకుతున్న వేళ
సుమసుగంధపరీమళం, వాతావరణంలోని
మారుతాన్నంతటినీ ఆబగా, ఆక్రమించినవేళ
ప్రవాహపు జలజలలు, వసంతకాలంలోని ఆకుల గలగలలూ
అన్నీ ప్రకృతి పారవశ్యాన్ని ప్రతిబింబిస్తున్న సమయాన
ధరాతలంలో మానవాళి కంతటికీ వరుమానాలనందిస్తున్న శుభఘడియలలో
ప్రభూ!!!
 నిన్ను యే సద్రూపానికి సారూప్యంగా యెంచుకోను?
స్వచ్చమైన నీ హృదంతరాళాల్లోనించి వెలువడే చిరుదరహాసాలతో పోల్చనా?
పిండారబోసినట్లు నేలంతాపరుచుకున్న శారదరాత్రుల చంద్రికల సొగసు తోనా?
పంటపొలాలగుండా ప్రవహిస్తూ క్షేత్రాలనన్నింటినీ సారవంతం చేస్తున్న జల కళలతోనా?

మలయానిలాలందించే అధరామృతాన్ని స్వీకరిస్తూ తలలూపే చివురు జొంపాలతోనా?
నాప్రేమ విశ్వజనీనమైనదైనా జీవనరంగస్థలంపై నెమలిలా నడయాడే నృత్యరీతిని గమనించు
జీవనగమనంలోని నాలుగుదశాల్లోనూ  నిత్యనూతనంగా శోభాయమానంగా విరాజిల్లుతున్న తీరును  దర్శించు  శైశవంలోని చిందులాటలతూనూ
యవ్వనంలోని కేరింతల సయ్యటలతోనూ  ---వార్ధక్యంగీసే ముదిమిరేఖలతోనూ
పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే రక్తచాలనంతోనూ
ఎల్లలెరుగక ఊటలా వూరే సందేహాలతో సంశయాలతో  సతమతమయే
అవి కలిగించే సంతోష సంతాపాల మధ్య పడి నలుగుతున్న జీవన శైలిని
విజయవంతంగా తీర్చిదిద్దుతూ జీవితపు సరంభాలను ప్రేమతో మిళితంచేసుకుంటూ
మూల్యాంకనంచేసుకునేదిశగా జీవనగమ్యాన్ని
 రసమయంగా తీర్చిదిద్దుకుంటున్నాను
*************************************

Sunday, November 22, 2015

గండు  కోయిలల గుంపు నవ గీతార్ణవంతో

గుండె గొంతుకలో గుస గుస లాడుతూన్న వేళ.
హేమంతం విసురుగా వీ చే చలిగాలుల చిత్తడికి
మనసు తడియారిన పెదవులతో
పాహి పాహి యంటున్న దేలనో ప్రభూ?
శిశిర ఝంఝలో చిందర వందరగా ఆకులు
క్రిందకు రాలుతున్నంత వేగంగా
ఆశలు నేలకు రాలి నిశ్శబ్దాన్ని నిలువునా
దహింపజేయవెందుకని?
శారదరాత్రులసన్నిధానంకోసమేనా
ఈ చిత్త చాంచల్యం చైతన్యాన్ని నిర్వీర్యం
చేసే దిశలో కృతకృత్యంకావాలనేందుకేనా

ఇలా  తహ తహ లాడడం?
అంతటా వాతావరణం  ఎందుకో  మరి
 పరి పరి విధముల  వింతగాతోచనోపు?
 నాకు ఈ ప్రకృతినర్తనమంతా
అస్తవ్యస్తంగా తోస్తున్నది
అందువలననే  ప్రభూ నీ మ్రోల ఈ విన్నపాల సుమ మాల!






Saturday, November 21, 2015

ఒకటా .రెండా .మూడా
రోకటి   తలపోట్లు నేడురోదించుటకా ?
ఒకటైపోదము !! రండొకొ
తకరారుల వుగ్రవాది తాటొలుచుటకై !!
ఒకడు అవునంటాడు
మరొకడే ముమ్మాటికీ కానే కాదంటాడు
ఇద్దరూ కలిసి మౌనంగావున్న వాడిని
ఉతికి ఆరేస్తారు! ఎంతతెల్లదనం ఎంతటి శ్వేత వర్ణం
అంటూ అందరూ జబ్బలుచరుచుకుంటూ చిత్తగించిపోతారు~~
ఇదేనవోదయం మహోదయం
అంటూ ఎగిరెగిరిపోతారు యువతరం.

Friday, November 20, 2015

ఓరిమియంత నశించెను
కూరిమి లేకున్న మనము కూళల లెక్కే
భారమె  యుగ్రుల చర్యలు
నేరమెగా మిన్న కుంట నేస్తమ వినుమా!

Thursday, November 19, 2015

వంటినిండా వస్త్రం కప్పుకున్న వసంతంలానీవు నాలో ప్రవేశించి
నాలో ఆశలను అందంగా చిగురింపజేసావు
చైత్రమాసమంతటా నాలో చైతన్య ధారలను
పొంగి ప్రవహించేలా శ్రద్ధ వహించావు.
వైశాఖం తొలిదశలోనే వీచిన వడగాలుల వీవనల్లొ వుడికే
గ్రీష్మ తాపం నుంచి నన్ను గణనీయమౌ తెలివితో తప్పించావు.
అనురాగం అనుభూతుల జడివానల్లో నన్ను అమృతాభిషేకంలో
తడిపి ముద్దను జేసి తన్మయత్వంలో ముంచెత్తి వేసావు.
హేమంతపు చలిగాలుల తీవ్రతనుంచి నన్ను ఉన్నిశాలువలాచుట్టేసి
నులివెచ్చని అనుభవాలతో నన్ను న్యూనతా భావాలనుంచి తప్పించావు.


శారదరాత్రులలో రసజ్ఞత ఇంపారగా శృంగార శేముషీఖనిగా తీర్చిదిద్దావు.

శిశిరఋతువు సమీపించగానే నన్ను ఒంటరితనపు చీకట్లపాల్జేసి
నేచేరరానిలోకాలకు చెప్పా పెట్టకుండా కనుమరుగై కన్నీటి సంద్రాన్ని కానుకా ఇచ్చి తరలిపోయావు,ఇదెక్కడిన్యాయమని
ఎవరినడిగితే సరయిన సమాధానం వస్తుందో తెలుసుకోలేక ఇలా
ప్రవాసంలో బహుదూరపు బాటసారిగా మిగిలిపోయి వగచడమే తీరై
వ్యధార్త హృదయ వాసిగా మిగిలినలిగిపోతున్నాను.
=============================================





ప్యారిస్ నగరమా !! నన్ను క్షమించు!
ఒక్క అశ్రువునైనా కార్చలేని నా
అసమర్ధతకు మనసారా మన్నించు.
విశాల విశ్వంలో ఎక్కడ విధ్వంసం
జరిగినా నీ సౌందర్య లాలసనే
సాగరమధనంలో మునిగి
మునకలేస్తూ పోయావు.

ఓకన్నీటిచుక్కనయినా రాల్చలేకుండా
మిన్నకుండా మిగిలిపోయావు!
మా బాంబేలో బాంబులతో దాడిజరిగితే
బాబోయ్ అని నీ నోటినుండి ఒక్కకేకయినా వినబడక

మేమంతా విస్తు పోయేలా చేసావ్
మేమూ మనుషులమేనన్న మాటనే మరిచావు.
ప్రపంచమంతా ఏకమైనా పంచుకోలేని పరితాపమేనీది.
మనుషులంతా ఒక్కుదుటున గుంపులు గుంపులుగా మూగినా
చల్లార్చడానికి వీలుకాని దు:ఖాగ్నియేనీది కాదనలేం!
ఎక్కడ యేమూలనవున్నా మనుషులంతా ఒక్కటేనన్న మాటను మాత్రం మరువబోకు..
అప్పటిదాకా నీ అందమైన నగరానికి
నరమేధం సందర్భంగా నా సానుతాపాన్ని ప్రకటించనందుకు
నన్ను మనసా వాచా కర్మణా మన్నించు అందాల సుందరనగరమా!!
===============================================

Wednesday, November 18, 2015

పంచదారలో అద్దిన వ్రేళ్ళతో
కీ బోర్డు పైన అక్షరాలను
చిత్రించి వుంటావు అందుకేనేమో
అదంతా పోతన గారి సీస పద్యంలా
మందారమకరందమై నన్ను
వలవేసి
శృంఖలాబద్ధను చేసిo ది.

శృంగారరస గంగాధరుడైన
శ్రీనాధునిపద్యాలతో నెయ్యంచేసివుంటావు
అందుకే అక్షరాలన్నింటా ఆ రసరాజం రసగుళికల్లా
నన్ను వ్యామోహపెట్టి వశంచేసుకుని బంధించాయి.

 తిక్కనగారి రాజకీయ చతురతను పసిగట్టి
నా వారితో నయముగ రాయబారం నెరపివుంటావు
బృందావనంలో రాసలీలల్లో  అలసి సొలసిన రాధికలా
నీ వొడిలోకి వాలిపోయి మనసున మల్లెల మాలలూగించుకుంటూ
నిద్రలేని రాత్రులను  గడుపుతూ
మనోహరమైన నీ రూపురేఖలకు పరవశనై నీ పేరునే తలుస్తూ
మోహనవంశిలా ముగ్ధత్వాన్ని సంతరించుకుని సంబరపడిపోయాను.

ఇప్పుడిక చెవులదగ్గర డప్పుల్లా మ్రోగే ఇప్పటి సినీగీతాలతో
నన్నుమాత్రం భయపెట్టాలని చూడకుసుమా!! పలాయనం చిత్తగించి
ప్రవాసంలోకి ఊర్వశిలా జారిపోయి దిగిరాను దిగిరాను భువికి అంటూ
మొరాయిస్తూ మొండికేస్తానని ముమ్మాటికీ నీకు హెచ్చరికగా చెప్తున్నాను.
==================================================

Tuesday, November 17, 2015

సరస్సు అంచున
సొగసులొలకబోస్తూ
సుడులు తిరుగుతూన్న
వాసంత సమీరం.
-----------------
దిస మొలతో
దిష్టిబొమ్మలా
 నిలబడిన చెట్టు
శిశిరానికది
 స్వాగత ద్వారమా?
--------------------------------------
పొగమంచునే
దుప్పటిగా కప్పుకుని
నిద్రలోజోగుతున్న
వీధి బాలలు.
-----------------------
ఆంతరంగికంగా గానీ,
బాహిరకంగా గానీ
అంతటా ముడతలముఖమే నాకు
శిశిరానికి చోటు చిక్కింది కదా!!
-----------------------------
తొందర తొందరగా
విస్తరిస్తున్న తిమిర సంధ్య.
పిల్లలంతా బుడి బుడి
నడకలతో గృహోన్ముఖం.

--------------------------
ఆవిడ వదిలిన వాటినన్నింటినీ
గట్టిగా పట్టుకుని వదలనంటున్న
శీతాకాలపు  శశిస్వరూపం.
--------------

ఉదయాన మెలుకువతోనే
రుద్రరూపంలో సాక్షాత్కరించే
సాక్షీ భూతుడుగా భానుడు.

దినపత్రికలలో రక్తాక్షరాలతో
గుమ్మం ముందుకు చేరుకున్న వేళ అది.
దృశ్య, శ్రవణ మాధ్యమాల్లో
ఎడతెగని ఏరులా పారే
 నిరంతరవార్తా ప్రసారంలో
తెగిపడిన శరీరాల
చాయా చిత్రాల సారణులు.
ఎదురుగా ముసుగుతో కప్పబడిన
 ముమ్మూర్తుల ముష్కరుల
 క్రూరoగా కుటిల మూర్తులు.
దినంతెల్లవారితే దిగ్గుళ్ళ దైనందినాలు.
ఇలాతలంపై ఇక ప్రశాంతతకు
చోటెక్కడ  మిత్రమా?
==============================

Sunday, November 15, 2015

సాగరమేఖలలను చుట్టిపారేస్తూ
తరూ సమూహంపైన
గుంపులు గుంపులుగా
పరుగెట్టే మబ్బులకన్నా
వడివడిగా ఉరుకులుబెట్టే
లోహవిహంగంలో తీరిగ్గా కూర్చుని

కోట్లవిలువజేసేఆకాశహర్మ్యాలూ
వారిసిరిసంపదలు ప్రదర్శితమయే
సిగసుచూడతరమా? అంటూ హొయలొలొకించే
వాహనసముదాయమతా బారులుతీరి
నడకలో అందాలసుందరాంగుల్లా పిల్లినడకలు
నడిచే కన్నెపిల్లలా సాక్షాత్కరించే వన్నీ
చిట్టిపొట్టి చీమల్లా దర్శనభాగ్యంకలిగించే
దృశ్యమాధ్యమంలో
గవాక్షంకుండా వాటి వాటి
గమనాలను  వీక్షిస్తూ
చేసివచ్చినప్రయాణాన్ని
ఎలా వర్ణించినా అలేఖ్యమే అనిపించడం
అపురూపమైనదే కదా!!
[పడులసార్లు ఇలా ప్రయాణాలుసాగించినా ఇవాళ చేసిన
ఈ గంటన్నర ప్రయాణం మనోహరమై నిలిచిపోయింది.]

Thursday, November 12, 2015

ఇప్పటిదాకా ప్రేమించడం చాలు !! ఇక్కడనుంచీ
ద్వేషించే అవసరమూ ఆసన్నమైనట్లుంది.
ప్రేమ ప్రేమ అంటు ఎన్నెన్ని వంచనలకు
 గురయిందో కదా ఈజగత్తు!

కాష్టంలా కాలిపోయిన మనస్సులెన్నో
లెక్కించి చెప్పగల గణాంకులున్నారా అని?

ప్రేమపేరుతో మోసపోయి జీవితాలను నడిమయానే
అర్ధాంతరంగా ముగించుకున్న కన్యామణులెందరో

వలచిన వాడు కొన్నాళ్లు సంసారంచేసి
ప్రక్కింటి వనిత మోజులోనో ఎదురింటి
 వెంకాయమ్మ చూపులకో కుమ్ములోపెట్టిన
వంకాయలా కుత కుతా   ఉడికిపోయి
ఏడడుగులు వేసి అగ్ని సాక్షిగా
ఆదుకుంటానంటూ మంత్రాలసాక్షిగా ఒప్పుకున్నవాడు
నిర్దాక్షిణ్యంగా  వదిలెస్తే  పుట్టిన సంతానంతో
ఎలా వేగాలోతెలియక వీధికెక్కిన ఇల్లాండ్రు గుర్తుకొచ్చి
విషణ్ణ వదనమే దిక్కయిపోయినప్పుడు ఇంకెందుకు
ప్రేమ అన్న పదాన్ని ఆదరించి ఆదుకోవాలో అర్ధం కాదునాకు.
అందుకే ఋజుమార్గానికి వారు వచ్చేదాకా
ఇక ప్రేమ అన్నపదాన్నే త్యజించాలని వంచకులను ఓగాడిలో
పడేసి ద్వేషించడం వల్ల సంప్రాప్తించే క్షోభను వారికవగతమయేలా
 ఇకపైన నడుచుకోవడం తధ్యమనే నా విన్నపం.
============================================
అమాయకంగా అలానేవుండిపోదలిస్తే
నీ భావప్రకటనకు ఆస్కారం శూన్యం.
క్రోధాతప్త హృదయం క్రింద
అదంతా కూరుకుపోతూ  వుంటుంది.


నీ అమాయకత్వం వాటున అవతలివాడు
నిన్ను ఆసాంతందోచుకునే వీలుంటుంది జాగ్రత్త!

అలాగే మిత్రులను ప్రేమాస్పదులను ఎంచుకోవడంలో
శ్రద్ధాసక్తులను కలిగి ప్రవర్తించు,

వారు నిన్ను వెన్నుపోటులను పొడిచే ప్రమాదం
అతి సన్నిహితంగా పొంచి వుండొచ్చు జాగ్రత్త సుమా!!

[ఓ ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో]

కాలం అంచులచెంత
అంతా నవనవోన్మేషమే
నీవు నిష్క్రమించాక
నాలో మిగిలిన ఏకాంతం
మాత్రం బాధిస్తుంది.
-----------------------
పండుగ వాతావరణం
వీధి బాలుడు
సగం వెలిగి ఆరిపోయిన
మతాబును మళ్ళీ వెలిగించిన
అతడి ముఖ కవళికల్లో
--------------
నక్షత్ర కాంతిలో
మెరుస్తూన్న ఆకాశం
చందమామకధనింకా
కొనసాగించనా?
---------------------
శీతాకాలంలో
నులివెచ్చని సంతోషం
కొత్తగా తండ్రినయానన్న
ఆత్మానందంలో
===============
అన్ని ప్రయాణాలూ
ఎలా చేయగలిగానో
ఈ పడవమునకలో
-------------------
ఆంగ్లం-రమేష్ ఆనంద్.

Wednesday, November 11, 2015

వైదుష్యం
--------------రావెల
-----------------------
కొన్ని వర్ణ  చిత్రాలాలను
అందంగా తీర్చి దిద్దడం
చెవులకు సోకనటువంటి
కొన్ని కధలను అందంగా అల్లడం
కొన్ని మధుర క్షణాలను
మనోహరంగా కాలయవనికపైకి
ముద్రించి  మురిపింపజేయడం
మనసును పట్టిపీడించే
 కొన్ని అనుమాన భూతాలను
అంతమొందించగలగడం.

జీవితంలోనుంచి కొన్ని ఉత్కంఠావహమైన
సందర్భాలను సంపుటీకరించడం
చిన్ని చిన్ని చుక్కలను కలుపుతూ
సరళ రేఖలుగా కూర్పు చేయగలగడం
కొన్ని పదప్రహేళికల్లో సులువుగా చిక్కని
వాటిని ఆధారాలను ఆలోచించి ఆలోచించి
 ఎట్టకే లకు గట్టెక్కిoచి హాయిగా గాలినిపీల్చడం

మనసుల్లో ఇట్టే సులువుగా మార్చగలిగిన
మబ్బుల రంగులను మనోఫలకాలపైన చిత్రించడం
దాని కన్నా అందంగా కాగితాలపై కలంతో చెక్కడం
ఇవన్నీ సమన్వమ్యం  చేయగల మేధ కవులకే
అక్షరాలా వుందని ఋజువు పరచడం
ఒక్క సాహితీ ప్రక్రియలే సాధ్యమని గుర్తెరిగి మసలుకోవడం
వైదగ్ధితోకూడిన వైదుష్యం కాక మరేమిటంటారు?

Tuesday, November 10, 2015

ఎగసాయం-----------రావెల పురుషోత్తమరావు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఊరు ఊరంతా బందెల దొడ్డిగా మారింది
మృత్యు గహ్వరానికీ దీనికే భలేగా సామ్యం కుదిరింది.
తెల్లబంగారమని పండిస్తేతెల్లటి వస్త్రమై మనిషిని కప్పేసింది.
మిర్చి బాగుందనుకుంటేఆ దిగుబడి తగ్గిపోయిఘాటుగా గుండెకు తగిలింది.
వరిపంట గదాని నారునాటి నీరుపోస్తే
పొ ట్ట కొచ్చిన కంకులను  మిడతలుమేతగా  నమిలేసాయి.
చెరకు తీపిని తలచుకుని ఎకరాలకు ఎకరాలను సాగుచేస్తే
అదికాస్తా చేదువిషమై కుటుంబాన్ని రోడ్డున  పడేసింది.

భీమా వస్తుందని కిస్తీలునెలనెలా కడితే
సొమ్ములుకాస్తా స్వాహా చేయబడింది.
అ మ్మాయి   పెళ్ళి,  అబ్బాయి చదువు ఇప్పుడిలా ప్రశ్నార్ధకమై మిగి లాయి .
ఆశించిన పురుగును చంపలేని క్రిమి సం హారక మందు
మనుషులను చంపడంలో మొదటిస్థానానికెదిగింది.
పొలం గట్లమీద పిట్టల్లా రాలిపడుతున్న కృషీవలుర
శవాగారం       రాజకీయానికి రాబందులా సహకరించింది.

చేతగాని నేతల వాగ్దానాలకొలిమిలో
రైతాంగం బ్రదుకు మాడి మసై
 బూడిదగా చివరకు మిగిలింది.

వ్యవసాయం ఆధునికంగా వ్యధార్త జీవితపు
యదార్ధ దృశ్యమై  హృదయమంతటినీ కలచివేసింది.
===================================
దీపం ముట్టించు తాతా!!!
====================
దీపం ముట్టించు తాతా
దీపం ముట్టించు.
కరుడుగడుతున్న గుండెల్లో
కసాయితనం కనుమరుగయేలా!!
కరుణరసాన్ని సేవించి
ప్రమిదల్లో అది ప్రేమజ్యోతిలా
అఖండంగా వెలిగే రీతిగా
దీపం ముట్టించు.
ఆడతనాన్ని అన్ని వేళలా
అవమాన పరిచేలా ప్రవర్తించే
మూర్ఖ మనసుల్లో చీకట్లు చెదరిపోయి
వెలుగు విస్తారంగా కుదురుకునేలా
సౌశీల్య దీపాన్ని వెలిగించు.
ఆరుగాలలాలపాటూ చెమటోడ్చి
అధికాధికంగా శ్రమించి
కల్తీ మందులతోనూ
వట్టిపోయిన విత్తనాలతోనూ
పూర్తిగా వంచించబడి దిక్కుతోచక
దైన్యంగాపొలం గట్లవెంట పిచ్చివాడిలా
పరిభ్రమించే రైతన్నల సమూహంలో
ధైర్య సాహసాలను నింపి
విశాల హృదయంతో జీవించగల
నేర్పును నిండుగా నింపుతూ
విషాదాన్ని వెన్వెంటనే పారద్రోలగల
వికాసజ్యోతిని వెలిగించి వడి వడిగా సహకరించు.
కుటుంబ కలహాల్లోకూరుకుపోయి
దుష్ట దర్శనాల్లో ప్రదర్శితమయే
ముష్టి ధారావాహికల ప్రవాహంలో
విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతున్న
గృహలక్ష్ములందరికీ" గుండె గుండెకూ
దీపకరండం" వెలుగుతూ,అనునిత్యం ధీరత్వాన్ని నింపి
సమకాలీన సమాజంలో తలెత్తుకుని తిరుగుతూ
దౌష్ట్యాన్ని ధైర్యంగా ఎదిరిచగల
తారాజువ్వల్లా ప్రకాశిస్తూ భావికాలంలో
ఋజుమార్గ దర్శనం చేయగల సాహస జ్యోతిని వెలిగించు!!!
-----------------------------------------------------------------
ఎందుకని?
---------------------
మతాబాల  ప్రకాశంతో
విజృంభించవలసిన దీపావళీ
కలుగుల్లోకిదూరి
కలతపెడుతున్నదెందుకని?

తారాజువ్వలా నింగికెగసి
ఆశలనువ్వెత్తుగా నిలపగల
అవకాశాలకు ఆస్కారమివ్వదెందుకని?

చిచ్చుబుడ్లా రెచ్చిపోవలసిన యువత
ఉద్యోకావకాశాలు దొరక్క
ఘూర్ణిల్లుతూ కూర్చోడమెందుకని?


తుస్సుమంటున్న మానవతావిలువలమధ్యన
చెమటోడ్చి చిగురులను సైతం తరువులుగా పెంచి పోషించిన
వృద్ధాప్యం మసిపూవొత్తుల్లా నుసిరాలుస్తూ
నిరాశల సంద్రంలో మునకలేయడమెందుకని?

"హాయిహాయిగా ఆమనిరేయి"లాంటిగీతాలతో
అలరించిన ఆపాత మాధుర్యాలు
అశ్లీలం అసభ్యాల పదాలపోహళింపులతో
నేటి సినీగీతాలు లక్ష్మీ బాబుల్లామారి
చెవులను చిల్లులుపొడిచే శబ్దాలమధ్య
చిరుగులతో  చిరాకుపెట్టడం ఎందుకని?
===========================

అవును, ఇవ్వాళ దీపావళిపండుగ
పొగరెట్ల కవులంతా పొగడ్తలకు
పొంగిపోతూ రెచ్చిపోయేలా కవితలనల్లే
 దీపావళిపండుగ.
మసిబారిన కుటుంబాలను
మనసునిండా ఆదరించెడి కవితలెన్ని?

మకిల బారిన మానవత్వానికి
వెలుగుదివిటీలనందిమి మార్గదర్శనం
చేయగల విజ్ఞాన ఖనులెందరు?

రాజకీయపు విషప్పురుగు
తల్లీ పిల్లలను కసిదీరా
కాల్చుకునేలా చిత్రవధను జేస్తే
ఒక్క అవార్డుగ్రహీతా స్పందించిన
కోశానపోయిన దాఖాలలేం కనబడలేదు.

చీకటి ముసిరిన గృహప్రాంగణాల్లో
వెలుగురేకలు విచ్చుకునేలా
సాయమందించగల
సాహితీ మూర్తులు కావాలి.

తిమిరంతో నిరంతరం సమరం చేయగల
ధీరోదాత్తులు కావాలి నేడు.
గతవైభవాలతో కడుపులునింపగల
స్వార్ధపరులకు స్థాన భ్రంశం చేయగల
సత్తాగలిని శౌర్యం ఇప్పుడు అవసరం తెలుసా?

నన్నంటిపెట్టుకుని గుబాళించే
ఆ రేకలన్నింటినీ ఒక్కొక్కటిగా
వలపు దాహం పేరుతో వొలిచేసావు.
భావగర్భితమైన
నా భాషణలన్నింటినీ
నీ సొంతం చేసుకుని పొంగిపోయావు.
నగ్న తరువులానేను శూన్యావకాశాలతో
నిలబడితే నవ్వులాటగానన్ను
నగుబాట్లపాల్జేసి నిందించావు.
ఇప్పుడేమో నువ్వే నాకు కావాలని
శిలావిగ్రహంలా నిలబడి బ్రతిమాలుతున్నావు.
నిన్నెలా నమ్మాలో అర్ధంగాక మౌనాన్నాశ్రయించి
ముగ్ధలా మూర్తీభవించి మూగనోము పట్టాను.

Monday, November 9, 2015

దీపావళిని మనసులోతలుచుకోగానే
తళుక్కున స్మృతిపధంలో మెరిసేవి
నా బాల్య స్మృతులు.

ఒ నెలరోజులు ముందునుంచే
రోలూ రోకలితో తయారయేవాళ్ళం.
అందులో మందుకూరి రోకలితో మూసి
బండకేసి రోకలివైపు బాదితే
పేలుడు శబ్దం వీధంతటికీ వినిపించేది.

ఆతర్వాత సొంతంగా కాగితంగొట్టాలను చేసి
బొగ్గులు బాగాపిందిచేసిన మసి నoదులోకూరి
సూరేకారం[!] తో కలిపి మసిపూవొత్తులు
 చేసి ఎప్పుడు రాత్రవుతుందా అని ఎదురుచూసి
కొన్ని కొన్నిగా బయటకు తీసి కాలుస్తుండే వాళ్ళం.

ఆతరువాత దం టుపుల్లలతో కాగడాలను తయారుచేసి
 వాటిని   వెలిగించి పరుగెడుతూ ఉంటే మంటలొస్తూ వుండేవి.

ఆతర్వాత చిన్నగా చిచ్చుబుడ్లను[ఖాళీవి కొని] అందులో మందును[సూరేకారం గంధకం కాలిపి కూరి పైన చిన్న తళుకుముక్క అంటించి జాగ్రత్తగా ఎండబెట్తి కాలుస్తూండే వాళ్ళం.
ఆతర్వాత దృష్టి పల్లెలనుంచి పట్నానికి ఎగబాకాక
పట్నం నుంచి నాన్న తెచ్చిన దీపావళి మందులు కాల్చేవాళ్ళం

ఆతర్వాత ఏకంగా బస్తీకే పెద్దచదువులకెళ్ళినా
 ఇంటికెళ్ళే  దీపావళి పండగ జరుపుకునే వాళ్ళం.

ఉద్యోగమొచ్చాక తీరుమారింది. అ న్నీ     కొన్న సరుకులేగాని
తయారుచేయడం అన్న మాటే మరుగున పడిపోయింది.
ఇప్పుడువిదేశాంలోకడుగుపెట్టాక నియమనిబంధను అధికంగాన
యే గుడికొ వెళ్ళి అక్కడ జరిగే సంబరాలను చూస్తూ సంతసించడం
అలవాటయిపోయింది.అందుకేగదా నన్నయ్యగారు గతకాలము మేలని వక్కాణించడం.

ఒంటరితనానికి
 అంకితమైన వాడిని నేను.
తుంటరి కుటుంబకధలతో
నన్ను ఊరించే ప్రయత్నాన్ని
ఇకనుంచీ విరమించడం మంచిది.

అనాదిగా అంకితభావంతో
బ్రదుకునీడుస్తున్న ప్రాణిని నేను
ముద్రారాక్షసాల చెరసాలలో
నన్ను బంధించాలని యోచించడం మానండి.

ఆస్తికమో నాస్తికమో ఏదో ఒక స్థిరత్వంతో
మనసును సముదాయించుకుంటున్న వాడిని
దుమారాల దుమ్మూ, ధూళులతో
నన్ను మకిలపరచాలని మలినం చే యాలని
ససేమిరా!   ప్రయత్నించి విఫలం కాకండి.


 వసుధేక కుటుంబం మే లనే భావనతో
 శ్వాసిస్తున్న వాడిని
వంటరితనంతో   వేగడమెందుకని?
ప్రశ్నలతో నన్ను దయచేసి వేధించకండి.


=============================

ఎగసాయం-----------రావెల పురుషోత్తమరావు.================================= ఊరు ఊరంతా బందెల దొడ్డిగా మారింది మృత్యు గహ్వరానికీ దీనికే భలేగా సామ్యం కుదిరింది. తెల్లబంగారమని పండిస్తేతెల్లటి వస్త్రమై మనిషిని కప్పేసింది. మిర్చి బాగుందనుకుంటేఆ దిగుబడి తగ్గిపోయిఘాటుగా గుండెకు తగిలింది. వరిపంట గదాని నారునాటి నీరుపోస్తేపొట్తకొచ్చిన కంకులను మిడతలునమిలేసాయి. చెరకు తీపిని తలచుకునిఎకరాలను సాగుచేస్తేఅదికాస్తా చేదువిషమైకుటుంబాన్ని రోడ్డున పడేసింది. భీమా వస్తుందని కిస్తీలుకడితేసొమ్ములుకాస్తా స్వాహా చేయబడింది. అమ్మయి పెళ్ళి అబ్బాయి చదువుఇప్పుడిలా ప్రశ్నార్ధకమై మిగిలింది. ఆశించిన పురుగును చంపలేని సం హారక మందుమనుషులను చంపడంలో మొదటిస్థానానికెదిగింది. పొలం గట్లమీద పిట్టల్లా రాలిపడుతున్న శవాగారంరాజకీయానికి రాబందులా సహకరించింది. చేతగాని నేతల వాగ్దానాలకొలిమిలో
రైతాంగం బ్రదుకు మాడి మసై బూడిదగా చివరకు మిగిలింది. వ్యవసాయం ఆధునికంగా వ్యధార్త జీవితపు యదార్ధ దృశ్యమై హృదయమంతటినీ కలచివేసింది. =============================
ఎక్కడినుండి ఊడిపడిందో ఈ తుఫాను గాలి బీభత్సం
చెట్లన్నీ పండుగరోజుల్లో పీర్లలాగా ఊగిపోతున్నాయ్.
ఉరుములు మెరుపులతో తన ఉనికిని చాటాలని
ఎంతగా ఉబలాట పడుతుందో దీని సిగదరగ
ఇంటికి తిరిగి రావాల్సిన పశువులెంతగా
 మార్గం  మధ్యంలో కంగారు పడుతున్నాయో
మధ్య మధ్యలో ధరిత్రి మాతకు
 శిరసుపైజల్లే శుభాక్షతల్లా
ఒక్కుదుటున నేలమీదకు దుమికి రావాలని
 తొందరపడుతున్న వడగండ్ల వాన.

నవ వధువు చిలకరించే చిరు మందహాసంలా
తొణకక తొలగక కురిసే తొలకరి జల్లుల పులకరింత.
  నిన్నటిదాకా పెనం మీద ఉడికినపదార్ధంలా
 ముటముటలాడుతూ  వరుస చెమట్లతో
 విరామంలేని విసుగును పంచిన  చిరాకుల ఆకాశం
చిరుజల్లుల ఆగమనంతో కొంత కొంతగా శాంతిస్తున్న వైనం.
--------______________________________

Sunday, November 8, 2015

చిరుజల్లులు
------------
బాల్యాన్ని
భారంగా భుజానికెత్తుకుని

ముసురువానలోనడుస్తూన్న నేను
ఇంతబరువును మోయగలనన్న
విశ్వాసం క్రమేపీ పలుచబడుతున్నది.
---------------------------
శీతలీకరించబడ్డ తారలను
ప్రతిబింబిస్తూ
నిశ్చలమైన జలాశయం

ఆమె అమాయకత్వాన్నిఇప్పటికైనా సరిగ్గా
మూల్యాంకనం చేయగలనా?
---------------------------
పర్వతాన్ని
అధిరోహిస్తూ నేను
ఆమె  హేమంతపు శాద్వరిలా
మేఘసందేశానికి
 చేరువగా నన్ను చేర్చాలని తపనపడుతూ.
----------------
అసుర సంధ్యను
 ఆవిష్కరిస్తూ కాకసమూహం
కధాగమనాన్ని ససేమిరా
కొనసాగించాల్సిందేనని
మొరాయిస్తూ   చిన్నపిల్లవాడు
==============
ఎంత వానబరువును
ఆ చిట్టిమేఘం మోయగలదు?
పొంగిపొర్లిప్రవహించే  కుంభవృష్టే
దాని నిరసనకు సాక్షాత్తూ
సోదాహరణమైన  తార్కాణం.
---------------------------
ఆంగ్లమూలం- రమేష్ ఆనంద్ [కవి అనుమతితో]
జాగేలరా--!!
========
నీ ముఖద్వారంవద్ద
ముభావంతో నిలబడియున్నాను
మందస్మిత హృదయారవిందుడవై
లాలనగా నన్ను కరుణించేందుకు
జాగేల ప్రభూ  వెన్నెల కరిగినీరవకముందే
ప్రభాతాన భక్తులసంఖ్యపెరుగుతూ వచ్చి
నీ ముఖద్వారం రాకపోకలకు క్రిక్కిరిసిపోకముందే
తక్షణమే కరుణాంతరంగుడవై
నీ దయార్ద్ర హృదయసౌహార్దతను
 ప్రకటించే వీలుంది స్వ్మీ వెనువెంటనే
 భీరుడను నన్ను దరిజేర్చుకునేందుకు ధీరుడవుగదా! బిరాన

రా కదలిరా-- నీమ్రోల విన్నపాల సుమమాలను చేతపట్టి
ఆశగా ఎదురుచూస్తున్నాను జాగేలరా ప్రభూ! రా కదలిరా!!
====================================

Saturday, November 7, 2015

గజి  బిజి
====================

పదబంధ ప్రహేళికలో
ఆధారం అంతుబట్టినా
అందుకోలేని అసలుసిసలు
 పదంకోసం అనవరతం
వెదుకుతున్న మెదడుకు
 మేత లాగానే గదా
నువ్వు నాకు నిరంతరం
అందుబాటులోలేని
అంతుకూడా చిక్కని
ద్రాక్షవౌతుంటావు
==================
ప్రేమను నిర్వచించమని ప్రశ్నిస్తే
ప్రతివాడూ జవాబులకోసం తడబడటం ఖాయం.
'అనుభూతి'ప్రధానమైనదని ఒకడు వాక్రుచ్చితే
"అనుభవేకవేద్యమని" పలాయనమంత్రం పఠించేదింకొకడు.

రెండుహృదయాలమేలుకలయికని బల్ల గుద్ది చెప్పడమేగాని
మేలయిన హృదయముందా? అని తనను తాను ప్రశ్నించుకునేవాడు అరుదు.

నేను నిన్ను ప్రేమిస్తున్నాననగానే పార్కులవెంటపరుగెట్టే
ప్రతి గుండే ప్రేమకు ప్రతిరూపం కానేరదు.

నిన్ను నీవు సదా,సర్వదా,సర్వధా ప్రేమించడం ప్రారంభిస్తే
శిశిరతరువులా ఎన్నో గూడుకట్టుకున్న నీ భావాలు నేలకు రాలిపడి
నీవైపు ఎకసక్కేలాడుతూ నవ్వుతాలుగా నిన్ను ఆటలుపట్టిస్తాయి.
ప్రేమ అమూల్యమైనదని వెలకట్టలేని వజ్ర తుల్యమని నిఘంట్వార్ధాలకందని
నికషోపలమనీ,  మృదుభాషణల ముత్యాలసరమనీ  ఇట్టే అవగతమౌతుంది.
=======================================================

Friday, November 6, 2015

వసంతంలా నా హృదయ ప్రవేశంజేసి
నాలుగు దశాబ్దాలపాటు నన్ను నన్నుగా నిలబెట్టి
నిండు హృదయంతో ఇంటినంతా సలక్షణంగా నడిపించి
నువ్వు మిగిల్చిన సౌహార్ద పరిమళవీచికలే
 ఇప్పటికీ నా నాసికాపుటాలచెంత నర్తిస్తూ
 ఆనందాన్ని కోల్పోకుండా
నన్ను నిరంతరం అలరిస్తూ,
సన్మార్గ గామిగా నన్ను నువ్వు
 తీర్చి దిద్దినక్షణాలింకా నాలో
సుడులు తిరుగుతూ సంయమనం వైపు
నడిపిస్తూనే,  నన్ను కన్నీటి కడలులలో
కరగి నీరవకుండా దృశ్యమానంగా నన్ను మిగిల్చి
కాపాడుతున్నాయని గుర్తు చేసుకోవడం
గొప్పవిషయమేనని
ఇప్పటికీ నా ప్రగాఢ విశ్వాసం.
==========================

నీ సాహితీ సుగతపు  స్వగతం ఓ కవయిత్రిని
నీ వలపు దారిలో పయనించేలాచేసింది.
ఆమె అందాన్ని ఆనందంగా అబివర్ణిద్దామని
కందాన్ని ప్రేమగా ఎంచుకుంటే
కలం కదలను పొమ్మని భీష్మించుకు కూర్చుంది.

ఆమెతో అనతికాలంలో యేర్పడిన చనువును
చక్కగా చంపకమాలతో చెప్దామని మొదలెడితే
యతిప్రాసల నడుమ ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ
ఉత్పలమాలవైపు ఉరుకులుబెట్టడం మొదలెట్టింది.

నీ సహితీ సుగతమైన పరిచయం
నిన్ను ఓ కవయిత్రిని ప్రేమించేలాపురిగొల్పింది.

మనసైనరీతిలో మత్తేభంవైపు అడుగులువేద్దామనుకుంటే
అవి శార్దూలపు నడకతో భయపెట్టడం మొదలెట్టింది.

నానీలు, రెక్కలు మరింకే ప్రక్రియ యైనాసరే
నాసరసుకు సరితూగలేవని కరాఖండీగా
చెప్పేసి కిమ్మిన్నాస్తిగా మూతిముడుచుకు కూర్చుంది.

పోనీ రుబాయీలతోనో,  గజళ్ళతోనో
ప్రస్థానం సాగిద్దామనుకుంటే తనరూపురేఖలకనుగుణంగా
పదాలపోహళింపు కుదరక పలాయనం చిత్తగించాయి.

ప్రియా!! నీవూహించిన ప్రతిపదసముచ్చయం
నా భావనకు వ్యతిరేకంగా వ్యవహరించడం
ప్రారంభించి తికమక పెట్టి,  తిట్లనందుకుంటున్నది.

నిన్ను బహుతపనతో అందంగాకూర్చాలన్న ప్రయత్నం మాత్రం
ప్రశ్నార్ధకంగానో ఆశ్చర్యార్ధకంగానో మారి నన్ను
పలయనం చిత్తగించేలాచేసి అప్రతిభుడిణ్ణిచేస్తూంటుంది.
=================================================

Thursday, November 5, 2015

గుప్పెడు మల్లెలను గుప్పిట్లోపెట్టుకుని
గుట్టుగా గడుపుతుందామనుకుంటే
విరబూసిన మల్లెలన్నీ నవ్వుతూ
వివరంగా నా వసతిని చెప్పేసాయ్.

పదిమాటలను మాలగా గుచ్చి
గుండెకదిమి దాచుకుంటే
గుండె లబ్ డబ్లను ఆపేసి
లవ్ లవ్ మంటూ నామనసును విప్పేసాయ్.

వసంతపు వలపువానలో తడిసిముద్దయి
విరగబూసిన పూలచెట్లన్నీ
శిశిరంలో కడుగుపెట్టి దిసమొలతో నిలుచుని
నిలువుదోపిడీకి గురయిన నానిజాయితీని
వివరణాత్మకంగా నిర్వచించడం మొదలెట్టింది.
===============================

Wednesday, November 4, 2015

చేతులు ఒకటినొకటి చాలనం చేసుకున్నాయ్
కనులు కనులను ఆత్మీయంగా కౌగలించుకున్నాయ్.
అలా మొదలయిన మనకలయిక హృదయగత
భావాలను మేదువుగా ఆవిష్కరించుకున్నాయ్.
అది గ్రీష్మర్తువులో చల్లబడిన సాయంసమయం
గోరింటాకు సువాసనలు గాలిలోకెగిరి తిరిగివచ్చి
నాసికాపుటాలచెంత నర్తిస్తున్న శుభముహూర్తం  .

నాపెదవులనంటిపెట్టుకోవాల్సిన వేణువు నేలకు
జారిపడి ముఖం ముడుచుకుని కూర్చున్న ఘడియలు
ఇంకా నీ పూల మాలనుకడుతున్న పనికూడా పూర్తవలేదు.
మనిద్దరిమధ్య పొడసూపిన ప్రణయం సాధారణ
గీతంలా నే సాగుతున్నటువంటి అతిసామాన్యమైన  సందర్భం.
నీ ముఖాన్ని కప్పెట్టిన కాషాయరంగు ముసుగు
నన్ను పూర్తిగా మత్తులోముంచేస్తున్న తరుణమది.
నీవు ధరించిన మల్లె చెండు నాహృదయాన్ని
వశీకరించుకునే మంత్రాన్నేదో జపిస్తున్నట్లనిపిస్తుంది.
అదొక ఇచ్చి పుచ్చుకునేలా, రహస్యాలను పంచుకుంటూ
అనుభూతులనన్నింటినీ వృద్ధిచేసుకుంటున్న సంతోషసమయంకూడా!!

కొద్ది కొద్దిగా చిరుమందహాసాలు,సిగ్గులమొగ్గలు
మరికొన్నెమో తీయని చిలిపి తగాదాలు .
మనంధ్య నడిచేప్రణయం ఒకగీతమంత సులబమైనది.

వర్తమాన్నన్ని అతిక్రమిచనోపని భ్రమలు
అసాధ్యమైందేదోసాధించడంకోసం పడనటువంటి తపన.
ఆ సౌందర్యాన్నికతుక్కుపోలేని చాయాసదృశమైన సందర్భం.
గాఢాంధ కారంలోనయినా తడబడకుండా సాగే ప్రయణం.
మనమధ్య సాగుతున్నప్రణయం కేవలం సర్వసాధారణమేసుమా!!

శూన్యాన్ని అవధరించని మన సంభాషణా చాతుర్యం.
ఆశలకనంతంగా విసరబడి నిస్తబ్ధతకు ఆస్కారమివ్వని కరకమలాలు.

మనం మనసంతోషాలను బాధలబరువుక్రిందా నలిగిపోకుండా
కాపాడుకుంటూ వస్తున్నాంగదా!!

మనంధ్య నడుస్తున్న ప్రణయం కేవలం సాధారణమైనదేనని నా మనవి


[టాగూరు తోటమాలిలోని 16 వకవితకు స్వేచ్ఛానువాదం]


జడ పదార్ధం
=============
ఘనీభవించగలవనుకున్న
క్షణాలన్నీ ద్రవీభూతమై
కరిగి కాలువలవెంట
 పొంగిప్రవహిస్తుంటే
 ఉలకవు పలకవు ఎందుకని?

మనవేననుకున్న సంగతులన్నీ
పరిమితులనతిక్రమించి
 పరాయి చెవుల్లోకి సునాయాసంగా
దూరిపొయి కలతల
 కల్లోలంలా భావిస్తుంటే
నిమ్మకు నీరెత్తినట్లలా
బెల్లంకొట్టిన రాయిలా
నిశ్చలమై స్థిరీకరించిపోయావేం?
ప్రియతమా!! మనమధ్య పొడసూపినది
ప్రేమంటావా?  పొరపొచ్చాలనుకుంటూ
సర్దుకు పొమ్మని ఉచిత సలహా విసిరేస్తావా?
===============================

Tuesday, November 3, 2015

నువ్వు ఎలాగున్నావో అలానే  వచ్చేసెయ్
అక్కడక్కడా తచ్చట్లాడవలసిన పనేంలేదు.
నీ జుట్టు ముడి విడబడినాసరే లేదా
పాపిట చెరిగిపోయినా సరే అలాగే విచ్చేయ్.
జడకు కట్టుకున్న రిబ్బన్లు వదులుగా వున్నాసరే
అదేమీ పట్టిచికోనక్కర్లేదు ఉన్నదానివున్నట్లుగానే వచ్చెయ్.

గడ్డిమీద గబగబా అడుగులువేసుకుంటూ వడి వడిగారా!!

మంచుపొరలు కప్పుకుని నీ కాలి అందేలు సడిచేయలేకపోయినాసరే
నీ పాదాలనటిపెట్తుకుని స్పందించే గజ్జెలు శబ్దంచేయడం మానినాసరే
నీ కంఠహారంలోంచి ముత్యాలు రాలి క్రిందకు జారిపడుతున్నాసరే
నువ్వాటిని వేటినీ లెక్కచేయవలసిన అవసరం లేనేలేదు వేగిరం వచ్చేసెయ్.

గడ్డిమీద అడుగులు వడి వడిగా వేసుకుంటూ గబగబా నడిచిరా!

 మేఘాలన్నీ ఒక్కసారిగా ఆకశాన్ని చుట్టుముట్టినట్లనిపిస్తున్నదా?
కొంగలన్నీ నది  అంచులమీచి పైకెగిరి బారులుగా వస్తున్నాయా?
విసురుగా వీస్తున్న గాలి వీవనలకు బీడుభూముల్లో మిగిలిన మొక్కలు
తలలూపుతూ తడబడపడుతున్న భావననీకేమైనా కలిగిందా?
బ్దిరిపోయిన పశువులు కొష్టాలవైపు పరుగులు పెడుతున్నాయా?
మబ్బులు ముడుచుకు పోతున్న దృశ్యమేమైనా నీ కంటపడిందా?

నీ ఇంట్లో ఇప్పుడు దీపం వెలిగించినా నిలబడదు కొడెక్కడం ఖాయమని గుర్తెరుగు!!

కాటుకతో నీ నేరాలనెందుకు అలంకరించుకోలేదని ఎవరెగుదురుగనుక?
నీ కంటిరెప్పలు వర్షపుమేఘాలకన్న దట్టంగా నల్లబడివున్నాయి.
ఇప్పుడిక నీవు ఇంట్లో దీపం వెలిగించికూడా ప్రయోజనమేమీ వుండదని తెలుసుకో!

మంచుపొరలు కప్పుకుని నీ కాలి అందేలు సడిచేయలేకపోయినాసరే
నీ పాదాలనటిపెట్తుకుని స్పందించే గజ్జెలు శబ్దంచేయడం మానినాసరే
నీ కంఠహారంలోంచి ముత్యాలు రాలి క్రిందకు జారిపడుతున్నాసరే
నువ్వాటిని వేటినీ లెక్కచేయవలసిన అవసరం లేనేలేదు వేగిరం వచ్చేసెయ్.

గడ్డిమీద అడుగులు వడి వడిగా వేసుకుంటూ గబగబా నడిచిరా!

 మేఘాలన్నీ ఒక్కసారిగా ఆకశాన్ని చుట్టుముట్టినట్లనిపిస్తున్నదా?
కొంగలన్నీ నది  అంచులమీచి పైకెగిరి బారులుగా వస్తున్నాయా?
విసురుగా వీస్తున్న గాలి వీవనలకు బీడుభూముల్లో మిగిలిన మొక్కలు
తలలూపుతూ తడబడపడుతున్న భావననీకేమైనా కలిగిందా?
బ్దిరిపోయిన పశువులు కొష్టాలవైపు పరుగులు పెడుతున్నాయా?
మబ్బులు ముడుచుకు పోతున్న దృశ్యమేమైనా నీ కంటపడిందా?

నీ ఇంట్లో ఇప్పుడు దీపం వెలిగించినా నిలబడదు కొడెక్కడం ఖాయమని గుర్తెరుగు!!

కాటుకతో నీ నేరాలనెందుకు అలంకరించుకోలేదని ఎవరెగుదురుగనుక?
నీ కంటిరెప్పలు వర్షపుమేఘాలకన్న దట్టంగా నల్లబడివున్నాయి.
ఇప్పుడిక నీవు ఇంట్లో దీపం వెలిగించికూడా ప్రయోజనమేమీ వుండదని తెలుసుకో!

వున్న పలంగానే నువ్వు యదాతధంగా వచ్చేసెయ్!
పూలమాలనల్లడం ఇంకా పూర్తికాకపోయినా పర్వాలేదు.
నీ చేతినలంకరించిన గొలుసును సరిగ్గా బిగించకపోయినా పర్లేదు.
ఆకాశమంతా దట్టంగా నల్లటి మబ్బులతో నిండిపోయివుంది. ఆలస్యం చేయకు
వడి వడిగా అడుగులేసుకుంటూ గబగబా నా చెంతకు చేరుకో!!

[టాగూరు తోటమాలిలోని 11 వ కవితకు నాతెలుగుసేత]



న్న పలంగానే నువ్వు యదాతధంగా వచ్చేసెయ్!
పూలమాలనల్లడం ఇంకా పూర్తికాకపోయినా పర్వాలేదు.
నీ చేతినలంకరించిన గొలుసును సరిగ్గా బిగించకపోయినా పర్లేదు.
ఆకాశమంతా దట్టంగా నల్లటి మబ్బులతో నిండిపోయివుంది. ఆలస్యం చేయకు
వడి వడిగా అడుగులేసుకుంటూ గబగబా నా చెంతకు చేరుకో!!
--------------------------------------------
[టాగూరు తోటమాలిలోని 11 వ కవితకు నాతెలుగుసేత]




రంగు, రంగ రంగ వైభోగంగా
-------------------రావెల పురుషోత్తమ రావు.

రంగులు మార్చేది రాజకీయమనితెలిసి
ఊసరవెల్లి విస్తు బోయింది.
ఇంద్రధనస్సు ఇబ్బడి ముబ్బడిగా
దు ఖించడం మొదలెట్టింది.

సిగ్గూ శరమూ చిరాకు పడ్తూ
ఖిన్న వదనలై నిష్క్రమించాయి.
----------------------------------------------------------------------
రావెల పురుషోత్తమరావు

Monday, November 2, 2015

దీపం ముట్టించు తాతా

-************
అటు చీకటి  ఇటుచీకటి
 తలెత్తి  యేదిశగాచూసినా
తలవంపులుతెచ్చే చీకటి
దీపం ముట్టించు తాతా
దీపం ముట్టించు

అనినీతి భారతాన అంతటా
అంధకారమే రాజ్యమేలుతుంది
తిమిరంతో సమరం
దీర్ఘకాలంగా  జరుగుతున్నది

విజయం
 జనం వైపే ఉండాలని
అఖండ జనావళి
అభిలషిస్తున్నది

ఈ చీకటి తెరలు తొలగిపోవాలనీ
వెలుగు రేకలు
 వెన్వెంటనే విచ్చుకోవాలనీ
ప్రతిహృదయం ఆశిస్తున్నది
ప్రతిగుండె   ఘోషిస్తున్నది

దీపం ముట్టించు తాతా
దీపం ముట్టించు
 తిమిరంతో  అలుపెరుగని
సంగ్రామానికి
సమర శంఖం పూరించు.

అప్పుడు ద్వాపరయుగంలో
ఒక్కడే
నరకాసురుడు
ఇప్పుడీకలియుగంలో
అడుగ డుగుకూ
 నరకాసుర సంతతే సుమా
అలజడినిసృస్టించి
ఆందోళను
ఊపిరిగామలచుకుని
జీవిస్తున్నది .

గనుల దోపిడీలో  ఘనాపాఠీ ఒకడు
సుపుత్రు డికి లక్షల కోట్లను
దఖలుపరిచిన దానవాగ్రజుడింకొకడు
వీటన్నిటికీ సాక్షీభూతంగా

ప్రజలను మభ్యపెట్టే దిశలో
ఊరేగుతున్న ఉలిపికట్టే ఇంకొకడు
జైల్లో ఇనుప ఊచలు లెక్కెడుతూ
జాగరణ చేసే దశలో ఇంకొకడు

అంతా అవినీతిభారతాన
అగ్రసనాధిపతులేసుమా
అంతా స్కాముల స్వాములే
మనకు ప్రతినిత్యం దర్శనమిచ్చే
వృశ్చికసంతతి ,  గమనించు తాతా
జాగ్రత్తగా ఒక  కంట కనిపెట్టివుంచు

దీపం ముట్టించు తాతా
దీపం ముట్టించు
 తిమిరంతో సంగ్రామానికి
సమర శంఖం పూరించు.
================
విసురుగా వీస్తున్న చలిగాలి
కొద్ది కొద్దిగా నులివెచ్చదనాన్ని
ఆదరువులా కొరుక్కుని,  నంజుకు తింటూ
 కొర కొరా నమిలేసేలా చూస్తూ
కొరివి దయ్యాన్ని ఇట్టే తలపింపజేస్తున్నది.

పాదరసంకన్నా వేగంగా
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
నింగినంతటినీ మబ్బుల గొడుగుగా మార్చేసి
దాన్నే  భానుడికి ఉన్నిబట్టలనుతొడిగినట్లుగా మార్చి
 ఊపిరాడకుండ జేసిఉక్కిరి బిక్కిరి గావిస్తున్నది.
ఇవ్వాళ్టి ప్రభాతసమయంలో
నా వలను సంద్రంపైకి విసిరాను.
వలను మల్లీ నాదగ్గరకు లాక్కునేసరికి
ఎన్నో సౌందర్య విలసితమైన వస్తువులు
దానిలోకి జారిపడి కన్నులెదుట కనిపించాయి.

కొన్ని దరహాస చంద్రికల్లా దర్శనమిస్తే
కొన్ని ఆనంద భాష్పాల్లా తళుక్కుమన్నాయి.
మరికొన్ని నవవధువు లేతబుగ్గలమీద
మెరిసే నక్షత్రాల్లా సాక్షాత్కరించాయి.


విరామమెరుగని దినచర్యానంతరం
ఎగురుకుంటూనే ఇంటికి తిరిగి చేరుకున్నాను.

ఆవిడేమో పూలనంటిపెట్టుకుని
వచ్చిన ఆకులనేరుతూ తోటలో కూర్చుంది.
సంశయిస్తూనే కొద్ది క్షణాలతర్వాత
ఆమెదగ్గరకు ఆనందంగా అడుగులేసుకుంటూ వెళ్ళాను.
వలనంతా ఆవిడ సమ్ముఖంలో పెట్టి
నిశ్శబ్దంగా నిలుచున్నాను.

ఆవిడ ఆ వలలోని వాటివైపు తీక్షణంగా చూసి
ఒక పిచ్చినవ్వును నావైపు విసిరేసి
ఈ పిచ్చి వస్తువులన్నీ ఏమిటి? వీటిని
ఉపయోగించడమెలాగో నాకు తెలీడంలేదు.
సిగ్గుతో నేను శిరసు వంచుకుని నిలుచున్నాను.
నేనువీటికోసమేమీ యుద్దo   చేయలేదుకదా!!
లేదా,  వాటిని విపణివీధిలో విక్రయించగా కొనలేదు.
ఇవి  ఆవిడకు కానుకలుగాకూడా తీసుకురాలేదు.

చీకటిపడ్దాక నేను తెచ్చిన వాటినన్నింటినీ
ఒక్కొక్కటిగా వీధిలోకి గిరవాటు వేసేశాను,
మరునాడు వుదయం బజారులో నడుస్తున్న
వాళ్ళు వాటినన్నిటినీ అపురూపంగా భావించి ఏరుకుని
గుండెలకు దగ్గరగా హత్తుకుని దూర దూర దేశాలకు
ఎగుమతి చేసి ధనికులై విలసిల్లారు,

మరింకా కోట్లకు  పడగలెత్తారు..

[టాగూరు తోటమాలిలోని 2 వ గీతానికి స్వేచ్ఛానువాదం]

Sunday, November 1, 2015

మూగ రోదన
-----------------రావెల
-------------------------------


అవును నీవన్నది నిజమే
బహుమతులకోసం కవితలురాసి
బజారుకు విసర బడ్డాను.

అవార్డులకోసం సంపుటిని వెలువరించి
అమ్ముకునే దిక్కు తోచక అభాసుపాలయ్యాను
కొనేవాడు కొరకొరాజూస్తే ఖంగు తిన్నాను.
 తిరిగి ఇవ్వడానికి నాదగ్గర మిగిలిందల్లా
వెలిసిపోయిన ప్రశంసా పత్రాల దొంతి.


కాళ్ళరిగేలా తిరిగినా అమ్మకానికి నోచుకోని
అసంపూర్తిగా మిగిలి అముద్రితమై ప్రకాశిస్తున్న
కవిత్వ సంపుటాలలో నాహృదయాన్ని పట్టిచూపలేని
విద్వాంసుల ముందుమాటల మేలు బంతుల క్రాంతి.

అందుకె నన్ను మన్నించమని అడగడానికికూడా
 నోరురావడంలేదనికూడా చెప్పలేని మూగజీవిని.
ఆవిడ సిం హాసనమనుకుంటూ మేము అనునుత్యం భావించే
కుర్చీ ఇవ్వాళ  ఖాళీగా దర్శనమిస్తున్నది.
అమె తన వ్యాయామ కేంద్రంగా గా భావించే కుట్టు మిషను
కునికిపాట్లు పడుతూ నిస్తాణగాకూర్చుంటున్నది.
ఆవిడనడయాడిన ప్రదేశమంతా బోసినవ్వుతో
పలకరిస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది.
శ్రమైక జీవనం అందించే తీయందనాల
స్వేదఫలాలమాధురీ మహిమను
అమ్మేగా అక్షరాలా మాకు తినిపించి
అవగతమయేలా అనుభవింపజేసింది.
అమ్మంటే కనులకు కమ్మనైన
కాంతిపుంజమనీ అంతు అడ్డులనెరుగని
అనురాగ భావనా వీచికల నందించే
అనుభూతి సంద్రమనీ
అర్ధమయేలోపు అమ్మ కనుమరుగయి
కళ్ళకు చీకటి ఆకాశం చేరువయితే
ఆ వ్యదార్త జీవుల హృదయ ఘోష
కవితగా  లిఖించబడి చెవులకు సోకితే
అక్షరాలన్నీ అలుక్కుపోయి
అపురూపమైన అమ్మలమీద పాటలన్నీ
విషాదగీతాలై  వినిపించవా?


ఆవిడపెంచిపోషించిన ఈ ప్రాణాలన్నింటికీ
హృదయగతమైన విషాదాన్ని దాచుకునే
చోటుదొరక్క అది గుండెగొంతుకలోంచి కనులదాకా
పొంగి పొరలి,  జలపాతమై,  కుండపోతగా క్రిందకు దూకుతున్నది.

[ఊహతెలియని వయసులో అమ్మనుపోగుట్టుకున్నహృదయఘోష
అమ్మను పోగొట్టుకున్నాందరికీఅందుబాటులోకొచ్చి అనుభూతి గీతంగా
అంకితమైపోవాలన్న భావనతో]


----------------------------------------------------------------------






నవ్వితే నవ్వండి!!
నాప్రేమ పరాజయం పాలయి
నన్ను విఫల మనోరధుడిగా మిగిల్చింది.

----
నమ్మితే నమ్మండి!!
నేనొక బృహద్గ్రంధమంతగా
 ప్రేమ లేఖను రచిస్తే
తను అల్పాక్షరాలతో
'నో' అని తలవూపి జవాబు చెప్పింది


-----
అలా ఉలితో ఈ బండ రాతిని
చెక్కుతూనే వుండు
ఏదో  ఒకనాటికి అది
అద్భుత  శిల్పమై రాణిస్తుంది.
ఆరూపం నాదికాకుండా జాగ్రత్తపడు!!
హంసతూలికా తల్పం లేకుండానే
ఇట్టే నిన్ను నిద్రలో ముంచేస్తుంది.

--------------------------------
పితృదేవతలను స్మరించుకోవాలన్న
సుదీర్ఘ కోరిక ఇక్కడ నిన్నటితో తీరింది.
ఇంటిముందు వెలసిన భూత ప్రేత పిశాచాలతో
ఇంటిముందు ప్రాంగణాల్లో వెలసి
 నిన్నటిదాకా కలత పెట్టిన
స్మశానశోభ నేటితో ముగిసినట్లయింది.
అస్తిపంజరాలకూ కంకాళాలకూ
 కొంతగా విరామం దొరికింది.


వీళ్ళ వేలంవెర్రిని డబ్బుచేసుకునే వ్యాపారం
మూడు సెంట్లూ ఆరు డాలర్లుగా వృద్ధిచెందింది.
ఆబాలగోపాలం చేసిన వీధి భాగోతానికి
మంచి గుమ్మడితో దిస్టితీయడంతో   ఇప్పటికి తెరపడింది.
దుకాణాలన్నీ వందనసమర్పణ దినోత్సవం[Thanks giving day]కోసం
ముస్తాబుచేసుకునే సమయం--- సొమ్ముచేసుకునే వాణిజ్యం
మొదలయే సుముహూర్తం దగ్గరపడింది
సంవత్సరంపాటు పౌష్థికాహారంతో పెంచబడిన

టర్కీ కోళ్ళకు ఇక ఆయువుతీరే సమయం ఆసన్నమయింది.

==========================================