Sunday, May 10, 2015

తొలుచూరి వేకువలోనూ తొణికిసలాడే
అరుణారుణ కాంతిచ్చటపు ప్రవాహం నీవేకదా.
పాదాలనంటి ప్రకాశించే పారాణివమ్మానీవు.

కమ్మని కవితలల్లగలిగిన కవులకు
కంఠదఘ్నంగా మెరిసే
రంగారు  బంగారు చంద్రహారం నీవు.

కలుపుమొక్కలనన్నింటినీ  కాలరాచి
పడిపాదులు స్వహస్తాలతో
వేసుకుని దిగుబడిచేతికొచ్చాక
దిగంతాల దరిదాకా విస్తరించగల
ఆనందాన్ని అందరికీ పంచిపెట్టే సౌమనస్యం
గూడుకట్టుకున్న సుక్షేత్రం నీవమ్మా!

నాట్లువేసే రోజుల్లో నాలుగు దిక్కులకూ
శ్రవణ పేయంగావినబడే పంటపొలాలచెంత ప్రతిధ్వనించే
కార్మికలోకం చిందులేస్తూ పాడుకునే
జానపద సంగీత స్రవంతివమ్మా నీవు.

చేను మధ్యలో కుంటదగ్గర కూర్చుని మధ్యాహ్నం నడినెత్తిన
నాట్యం చేయాలని తహతహలాడే సూరీడు
తైతక్కలాడే సమయానికి  అన్నం మూట విప్పుకుని చూస్తే
ముద్దగా కలిపి పెట్టిన పెరుగన్నంలో ఎరుపు చుక్కలా కనుపించే
ఆవకాయ బద్దవునీవు కాదనగలవా  రెవరమ్మానిన్ను
మట్టి తాబేటికాయలో చల్లగా గొంతుదిగే మంచినీటి గ్రీష్మామృత
 చల్లటి పానీయమమమ్మా  నీవు.
చిత్తజల్లువు స్వాతివానవూ నీవే
తొలకరిపిలూల తొలికోడికూతవూ నీవు కాదటే అమ్మా!
చీకటిని చివరంటా పారిద్రోలేందుకు తిమిరంతో నిరంతరం
జరిపే సమరమమ్మా నీవు, వెలుగురేకలు విప్పర్చుకునేలా
 చూసుకునే భానూదయం నీవేకదమ్మా!




No comments:

Post a Comment