Sunday, May 10, 2015

 భానూదయం
===============


తొలిచూరు వేకువలో తొణికిసలాడే
అరుణారుణ కాంతిచ్చటపు ప్రవాహం నీవేకదా.
పసిపాపల  పాలనాపటిమలో
పాదాలనంటి ప్రకాశించే పారాణివమ్మానీవు.

కమ్మని కవితలల్లగలిగిన కవులకు
కంఠదఘ్నంగా మెరిసే
రంగారు  బంగారు చంద్రహారం నీవు.

కలుపుమొక్కలనన్నింటినీ  కాలరాచి
పడిపాదులు స్వహస్తాలతో
వేసుకుని దిగుబడిచేతికొచ్చాక
దిగంతాల దరిదాకా విస్తరించగల
ఆనందాన్ని అందరికీ పంచిపెట్టే సౌమనస్యం
గూడుకట్టుకున్న సుక్షేత్రం నీవమ్మా!

నాట్లువేసే రోజుల్లో నాలుగు దిక్కులకూ
శ్రవణ పేయంగావినబడే పంటపొలాలచెంత
 ప్రతిధ్వనించే
కార్మికలోకం చిందులేస్తూ పాడుకునే
జానపద సంగీత స్రవంతివమ్మా నీవు.

చేను మధ్యలో కుంటదగ్గర కూర్చుని మధ్యాహ్నం నడినెత్తిన
నాట్యం చేయాలని తహతహలాడే సూరీడు
తైతక్కలాడే సమయానికి  అన్నం మూట విప్పుకుని చూస్తే
ముద్దగా కలిపి పెట్టిన పెరుగన్నంలో ఎరుపు చుక్కలా కనుపించే
ఆదరువుగా నిలిచే,  ఆవకాయ బద్దవునీవు,
కాదనగలవా  రెవరమ్మానిన్ను?

మట్టి తాబేటికాయలో చల్లగా గొంతుదిగే గ్రీష్మామృతపు
 చల్లటి మంచినీటి   పానీయమమమ్మా  నీవు.
చిత్తజల్లువు స్వాతివానవూ నీవే
తొలకరిపిలుపుల తొలికోడికూతవూ
నీవు కాదటే అమ్మా!
చీకటిని చివరంటా పారద్రోలేందుకు
తిమిరంతో నిరంతరం సమర o జరిపే యోధ వే  నీవు
 వెలుగురేకలు విప్పార్చుకునేలా,  చూసుకునే
 భానూదయం నీవేకదమ్మా!
==================================

No comments:

Post a Comment